కరీంనగర్ · May 9, 2026

బిఆర్ఎస్, బీజేపీలు దొందు దొందే.. ప్రజలను మోసం చేయడంలో ఇద్దరూ ఒక్కటే: వొడితల ప్రణవ్ ధ్వజం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హుజూరాబాద్,వి90న్యూస్, మే 09: బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు లోపాయకారీ ఒప్పందాలు కుదుర్చుకొని, పైకి మాత్రం విమర్శలు చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. శనివారం హుజూరాబాద్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

వ్యక్తిగత బలప్రదర్శన కోసమే కరీంనగర్ బంద్..

కరీంనగర్ బంద్‌కు బిఆర్ఎస్ పిలుపునివ్వడంపై ప్రణవ్ మండిపడ్డారు. “ఈ బంద్ ప్రజల సమస్యల కోసమా? లేక కేటీఆర్, కౌశిక్ రెడ్డిల వ్యక్తిగత బలప్రదర్శన కోసమా?” అని ఆయన ప్రశ్నించారు. పీఎంజే జ్యువెలరీ చోరీ కేసులో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నారని, నిందితులను పట్టుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించినా.. దొంగతనాన్ని కూడా రాజకీయం చేయడం సిగ్గుచేటని అన్నారు.

కౌశిక్ రెడ్డికి హుజూరాబాద్‌లో ముఖం చెల్లడం లేదు..

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ప్రణవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మొఖం చాటేసిన ఎమ్మెల్యే: హుజూరాబాద్‌లో ప్రజలకు ముఖం చూపించలేక కౌశిక్ రెడ్డి కరీంనగర్ వెళ్లి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

రీల్స్ పిచ్చి: ప్రజల సమస్యల కంటే సోషల్ మీడియాలో రీల్స్ చేయడంపైనే కౌశిక్ రెడ్డికి ధ్యాస ఎక్కువని, వావిలాల ప్రమాద బాధితులను పరామర్శించే తీరిక ఆయనకు లేదని విమర్శించారు.

పోలీసుల పట్ల వైఖరి: కేవలం హైలైట్ అవ్వడం కోసం, తన చుట్టూ పోలీసు వాహనాలు ఉండాలనే మోజుతోనే ఆయన అశాంతిని సృష్టిస్తున్నారని ఆరోపించారు.

కేటీఆర్‌కు అధికార దాహం.. కాంగ్రెస్ రైతు పక్షపాతి

వరంగల్ సభలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రణవ్ ఖండించారు. “పదేళ్లలో చేయని రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోపే రూ. 22,000 కోట్లతో పూర్తి చేసిందని” గుర్తు చేశారు. గతంలో వరి వేస్తే ఉరి అన్న బిఆర్ఎస్ నేతలు, ఇప్పుడు సన్నవడ్లకు రూ. 500 బోనస్ ఇస్తున్న కాంగ్రెస్‌ను విమర్శించడం హాస్యాస్పదమని అన్నారు. కేటీఆర్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారని, అధికార దాహంతోనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

జిల్లా ప్రశాంతంగా ఉంది.. తప్పుడు ప్రచారాలు నమ్మకండి

కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బాధ్యతాయుత పదవుల్లో ఉండి జిల్లాలో అశాంతి ఉన్నట్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ప్రణవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో నేర నియంత్రణ పటిష్టంగా ఉందని, కరీంనగర్ జిల్లా ప్రశాంతంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.ఈ సమావేశంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor