కొనకనమిట్ల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
కొనకనమిట్ల,వి90 న్యూస్, మే 11: మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని కొనకనమిట్ల మండలాన్ని గతంలో అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని, భవిష్యత్తులోనూ ఈ ప్రాంతాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే బాధ్యత తమదేనని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మండలంలోని వెలిగండ్ల, మునగపాడు, బస్వాపురం, వద్దిమడుగు, ఇరసల గుండం మరియు పెదారికట్ల గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామ కమిటీలు, బూత్ కమిటీల సమావేశాల్లో ఆయన పాల్గొని కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు.సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే పట్టణాలతో పాటు పల్లెల్లోనూ నిజమైన అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించి, కేవలం అరాచకాలకే ప్రాధాన్యత ఇచ్చిందని విమర్శించారు. ఇప్పటికే మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించుకున్నామని, త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఈ మండలంలో రెండు వేల కోట్ల రూపాయల వ్యయంతో రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించి ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని వివరించారు.గతంలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను బూత్ కమిటీ సభ్యులు గడపగడపకూ వెళ్లి ప్రజలకు వివరించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ పర్యటనలో కొనకనమిట్ల మండల నాయకులు, వివిధ గ్రామాల తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు , కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
