బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్టు చేయాలి: మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ డిమాండ్
హుస్నాబాద్, వి90 న్యూస్, మే 11: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం హుస్నాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ కేసును నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న భగీరథ్‌పై ఎఫ్ఐఆర్ నమోదై మూడు రోజులు గడుస్తున్నా, పోలీసులు ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండదండలు ఉన్నాయని ఆయన విమర్శించారు. హోం మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి ఆదేశాల వల్లే పోలీసులు జాప్యం చేస్తున్నారని, బాధితుల కుటుంబ సభ్యులను పోలీసులు బెదిరింపులకు గురిచేయడం అత్యంత దారుణమని మండిపడ్డారు. సాధారణ పౌరులకు ఒక న్యాయం, మంత్రుల కొడుకులకు మరొక న్యాయమా అని ప్రశ్నించిన సతీష్ కుమార్, పోక్సో చట్టం కింద నమోదైన ఈ కేసును సాధారణ కేసుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని నిరూపించాలంటే వెంటనే భగీరథ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాలని, అలాగే బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
