కరీంనగర్ · May 17, 2026

జమ్మికుంట-కరీంనగర్ రహదారిపై మృత్యుఘోష: రోడ్లపై ధాన్యం కుప్పలే ప్రాణాంతకాలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జమ్మికుంట,వి90 న్యూస్ ,మే 17: జమ్మికుంట నుండి కరీంనగర్ వెళ్లే ప్రధాన రహదారి ప్రస్తుతం వాహనదారులకు నరకాన్ని చూపిస్తోంది. ఒకప్పుడు సాఫీగా సాగిన ప్రయాణం ఇప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని స్థితికి చేరుకుంది. ముఖ్యంగా గత పది రోజుల వ్యవధిలోనే ఈ మార్గంలో మూడు భారీ ప్రమాదాలు సంభవించడం ఇక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ వరుస ఘటనలతో స్థానిక ప్రజలు , వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.ఈ ఘోర ప్రమాదాలకు ప్రధాన కారణం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆపాది జమ్మికుంట ప్రాంతం నుండి ప్రధాన రహదారిలో ధాన్యం ఆరబోయడానికి వినియోగించడమేనని స్పష్టమవుతోంది. సాగు చేసిన మక్కలు, వరి ధాన్యాన్ని ఆరబోసేందుకు రైతులు రహదారిలో ఒకవైపును పూర్తిగా ఆక్రమించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎటువంటి ముందస్తు హెచ్చరిక బోర్డులు గానీ, సూచికలు గానీ లేకుండా ఇష్టానుసారంగా రోడ్డును బ్లాక్ చేయడం వల్ల ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఒకదానికొకటి ఢీకొంటున్నాయి. రాత్రి వేళల్లో ఈ సమస్య మరీ జటిలంగా మారుతోంది, రోడ్డుపై ధాన్యం కుప్పలు ఉన్నాయన్న విషయం తెలియక వేగంగా వచ్చే వాహనదారులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.అధికారులు , పోలీసులు ఈ అంశంపై నోటీసులు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదు. పంటను ఆరబోసుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేక రైతులు రహదారిని వాడుతున్నప్పటికీ, అది సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లుగా మారుతోంది. యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవడంలో లేదా రైతులకు కల్లాల వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపడంలో విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం నోటీసులకే పరిమితం కాకుండా, రహదారిపై ధాన్యం ఆరబోయకుండా కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు చూపుతున్న ఉదాసీనత వల్లే ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదాల వల్ల ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తులు మరణించడంతో వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. మనువేదన అనుభవిస్తున్న బాధితుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు ఎప్పటికి కోలుకుంటారో, మళ్లీ తమ సాధారణ జీవితాన్ని గడుపుతారో లేదో తెలియని అనిశ్చితి నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, మొద్దునిద్ర వీడి తక్షణమే రహదారిపై ధాన్యం కుప్పలను తొలగించాలని, వాహనదారుల ప్రయాణాన్ని సురక్షితం చేయాలని జమ్మికుంట ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor