ఆంధ్ర ప్రదేశ్ · May 17, 2026

విజయవాడ జీజీహెచ్ ఘోరంపై రాష్ట్ర వైద్య మంత్రి రాజీనామా చేయాలి: నగర కాంగ్రెస్ డిమాండ్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

గవర్నర్ పేట, వి90 న్యూస్ మే 17:విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) లో రోగికి తొలగించిన కాలును కుక్కలు పీక్కుతిన్న నిన్నటి అమానవీయ సంఘటన రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం పడిపోయిన స్థితికి అద్దం పడుతుందని, ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా డిమాండ్ చేసింది. ఆదివారం గవర్నర్ పేటలోని నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, మాజీ పీసీసీ ప్రధాన కార్యదర్శి షేక్ అన్సారీ, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ తదితరులు మాట్లాడారు. ​ఈ సందర్భంగా నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ, చుట్టుపక్కల నాలుగు జిల్లాల ప్రజలు మెరుగైన వైద్యం కోసం ఆశ్రయించే జీజీహెచ్‌లో కనీస సదుపాయాలు కరువయ్యాయని, అధికారుల విధి నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు. తిరుమల తర్వాత రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయమైన విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో సిబ్బంది నుండి సెక్యూరిటీ షాపుల వరకు అనేక అవకతవకలు జరుగుతున్నాయని, భక్తులకు సేవలు అందించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. దుర్గగుడి పాలనను చక్కదిద్దేందుకు వెంటనే సీనియర్ ఐఏఎస్ స్థాయి అధికారిని కార్యనిర్వహణాధికారిగా (ఈవో) నియమించాలని కోరారు.

​గన్నవరం విమానాశ్రయంపై నిర్లక్ష్యం వీడాలి

మాజీ పీసీసీ ప్రధాన కార్యదర్శి షేక్ అన్సారి మాట్లాడుతూ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ఘోరమైన నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. నిన్న కాక మొన్న ప్రారంభించిన భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంటే, దశాబ్దాల చరిత్ర ఉన్న గన్నవరం విమానాశ్రయాన్ని మాత్రం పాలకులు గాలికొదిలేశారని, ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకుని విమానాశ్రయ అభివృద్ధిపై శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు.

​సింగ్ నగర్ పరిసరాల్లో డిగ్రీ కళాశాల, అండర్ రైల్వే బ్రిడ్జి నిర్మించాలి

ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలో విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నా, నగరవ్యాప్తంగా కేవలం ఒకే ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉండటం శోచనీయమన్నారు. తక్షణమే విద్యార్థుల సౌకర్యార్థం అజిత్ సింగ్ నగర్ పరిసర ప్రాంతంలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే వాంబే కాలనీ, సింగ్ నగర్, పాయికాపురం, ప్రకాష్ నగర్, కండ్రిక, రాజీవ్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు నిత్యం తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలతో నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ట్రాఫిక్ ఇబ్బందులను శాశ్వతంగా అరికట్టేందుకు మధుర నగర్, బి.ఆర్.టి.ఎస్ రోడ్డును అనుసంధానం చేస్తూ తక్షణమే అండర్ రైల్వే బ్రిడ్జి (URB) నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

​రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, అవినీతికి అడ్డుకట్ట వేయాలి

నగర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని, వారి పంటకు తక్షణమే గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని, పాలకులు ఇప్పటికైనా స్పందించి అవినీతికి అడ్డుకట్ట వేసి, ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి రహిత రాష్ట్రంగా మార్చాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor