ఆంధ్ర ప్రదేశ్ · May 24, 2026

గోదావరి-కావేరి నదుల అనుసంధానం వెనుక మోదీ, అమిత్ షాల జల వివాద రాజకీయ కుట్ర: రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆరోపణ

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

రాజమండ్రి,వి90 న్యూస్, మే 24: గోదావరి – కావేరి నదుల అనుసంధానం వెనుక కేంద్రంలోని మోదీ, అమిత్ షా ల బారి రాజకీయ కుట్ర దాగి ఉందని, కేంద్ర జల సంఘం తీసుకొచ్చిన రెండు కొత్త ప్రతిపాదనల వల్ల ఆంధ్రరాష్టం ఎడారిగా మారే ప్రమాదం ఉందని, తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్‌పీసీ) వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాజమండ్రిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ సెక్యులర్ మేడిచర్ల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రుల రాజకీయ బలహీనతలను ఆసరాగా చేసుకుని మోదీ మార్కు రాజకీయం నడుస్తోందని విమర్శించారు. గోదావరి జలాలను కావేరికి అనుసంధానం చేసి, కర్ణాటక, తమిళనాడు రాజకీయాలను బీజేపీ వైపు తిప్పుకోవడమే ఈ నదుల అనుసంధాన వ్యూహమని దుయ్యబట్టారు. అభివృద్ధి, ఉపాధి మార్గాల వైపు దృష్టి సారించకుండా ప్రజల ఆలోచనలను నిర్వీర్యం చేస్తున్నారని, ఈ ప్రాజెక్టుల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు జరిగే మేలుపై శాస్త్రీయ పరమైన చర్చ జరగాలని డిమాండ్ చేశారు. స్థానిక రాష్ట్రాలకు నష్టం లేకుండా ఇతర రాష్ట్రాలకు ప్రయోజనం ఉండేలా ఉండాలి తప్ప, ప్రజలు నష్టపోయేలా జల వివాదాలకు ఆజ్యం పోయకూడదని హితవు పలికారు. పోలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలు, పోలవరం, నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్ట్‌లకు రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకరిస్తూ సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు.తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ అధికార భయం మోదీ, అమిత్ షాలకు వరంగా మారిందని, అక్కడ జెండా మాత్రమే టీవీకే పార్టీదైనా అజెండా మొత్తం మోదీ కనుసైగల్లోనే నడుస్తోందని మేడా శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మోదీ రాజకీయాలకు ప్రపంచ ప్రైవేట్, కార్పొరేట్ దిగ్గజాలు కొమ్ము కాస్తున్నాయని, యావత్ సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు దాసోహం చేయించడమే ఈ అంతర్గత కుట్రల ముఖ్య ఉద్దేశమని ఆరోపించారు. విజయ్ గెలుపు వెనుక మోదీ ఆశీస్సులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజకీయ వ్యూహం ప్రధాన ముడిసరుకని పేర్కొన్నారు. కేంద్ర జల సంఘం తీసుకొచ్చిన ప్రతిపాదనల్లో పోలవరం నుండి కావేరి ఆనకట్ట వరకు 164 టీఎంసీల నికర జలాలను తమిళనాడుకు మళ్లించేలా ప్రణాళికలు రచించారని, అలాగే సమ్మక్క సారక్క బ్యారేజి నుండి నాగార్జున సాగర్ వరకు 45 టీఎంసీలు సాగర్‌లో కలపకుండా తరలించేలా కుట్రలు చేస్తున్నారని, దీనివల్ల భవిష్యత్తులో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.హైదరాబాద్ వేదికగా పవన్ కళ్యాణ్‌ను పరామర్శించే కుంటిసాకుతో చంద్రబాబు, లోకేష్‌ల సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్య చర్చలు జరిగాయని, దీన్ని నిరూపించే దమ్ము వారికి ఉందా అని సవాల్ విసిరారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల రాజకీయ బలహీనతలను బూచిగా చూపి లొంగదీసుకోవడం మోదీ సర్కార్ ప్రత్యేక శైలి అని విమర్శించారు. ఈ కొత్త ప్రతిపాదనలపై నిపుణులతో చర్చ జరిపించకపోతే ఇప్పటికే ఎండిపోతున్న కృష్ణా, గోదావరి నదుల పరివాహక ప్రాంతాలు మరింత దెబ్బతింటాయని, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వృధాగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర జల సంఘం కొత్త ప్రతిపాదనలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, రైతులు ఐక్యతతో, ఉమ్మడి కార్యాచరణతో ఎదుర్కొని తమ భవిష్యత్తును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆర్‌పీసీ సెక్యులర్స్ ఎం.డి. హుస్సేన్, దుడ్డే త్రినాథ్, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, బసా సోనియా, దోషి నిషాంత్, ముప్పన రమేష్, మాసా లక్ష్మి, చల్లా శివ దుర్గా రావు, మాసా ప్రమీల, లంక వీర వెంకట సత్యనారాయణ, దోషి సుజల్, నాగూరి సింహాచలం, మాసా అప్పాయమ్మ, చల్లా అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor