ఆంధ్ర ప్రదేశ్ · May 24, 2026

క్లస్టర్ స్థాయి మహానాడును విజయవంతం చేయండి: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కొత్తపేట,వి90 న్యూస్ ,మే 24: ఈ నెల 27, 28 తేదీల్లో క్లస్టర్ స్థాయిలో జరగనున్న తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘మహానాడు’ను జయప్రదం చేయాలని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. రావులపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన మహానాడు సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి మహానాడును క్లస్టర్ స్థాయిలో నిర్వహిస్తున్నామని, నియోజకవర్గ మరియు క్లస్టర్ పరిధిలోని స్థానిక అంశాలపై క్షుణ్ణంగా చర్చించుకోవడానికి ఇదొక గొప్ప అవకాశమని అభివర్ణించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం క్లస్టర్ వారీగా పార్టీని బలోపేతం చేయడానికి, గత రెండు సంవత్సరాల కాలంలో జరిగిన మంచి చెడులపై సమీక్షించుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం జరిగి వ్యవస్థలన్నీ కుప్పకూలాయని, వాటి నుంచి కోలుకుని రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి బాటలో పయనింపజేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న భగీరథ ప్రయత్నాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.గ్రామాలను, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూనే, ప్రజలకు నిరంతరం సేవలందిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇందుకోసం నాయకులు, కార్యకర్తలు అంతా విభేదాలు పక్కనబెట్టి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈసారి మహానాడును ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో నిర్వహిస్తున్నందున, మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రత్యేకంగా ప్రోత్సహించాలని కోరారు. క్లస్టర్ పరిధిలో ఉన్న కుటుంబ సాధికార సారథుల నుంచి బూత్ ఇంచార్జ్‌లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీ, క్లస్టర్ కమిటీ సభ్యుల వరకు అందరూ తప్పనిసరిగా హాజరై మహానాడును విజయవంతం చేయాలన్నారు. ఈ సన్నాహక సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్‌లు, యూనిట్ ఇంచార్జ్‌లు, గ్రామ పార్టీ అధ్యక్షులతో పాటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor