తెలంగాణ · May 24, 2026

అంధకారంలో పోతన నగర్ శ్మశాన వాటిక: సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో అంత్యక్రియలు నిర్వహిస్తున్న దుస్థితిపై స్థానికుల ఆగ్రహం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

వరంగల్, వి90 న్యూస్, మే 24: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 11వ డివిజన్ పోతన నగర్ హిందూ శ్మశాన వాటిక దయనీయ స్థితికి చేరింది. పాలకులు కోట్ల రూపాయల అభివృద్ధి గొప్పలు చెప్పుకుంటున్నా కనీసం శ్మశాన వాటికను కూడా పట్టించుకోకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. రాత్రి వేళల్లో ఇక్కడ ఒక్క లైట్ కూడా లేకపోవడంతో, మృతుల కుటుంబ సభ్యులు మొబైల్ టార్చ్‌ల వెలుతురులోనే అంత్యక్రియలు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. శ్మశాన వాటికలో కనీస నీటి సదుపాయం కోసం బోర్ గానీ, ఇతర ఏర్పాట్లు గానీ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మూడు రోడ్లు, నాలుగైదు గదుల నిర్మాణం పేరిట గతంలో కోటి రూపాయల వరకు నిధులు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పనులు ఎక్కడా కనిపించడం లేదు సగం లోనే నిలిచిపోయిన గదుల నిర్మాణం అధికారుల పనితీరుపై అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. మరో రూ. 30 నుండి 40 లక్షలు కేటాయిస్తే ఈ పనులు పూర్తవుతాయని స్థానికులు చెబుతున్నారు. శ్మశాన వాటిక నిధులను కూడా పక్కదారి పట్టించారా అంటూ ప్రజలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.మాజీ మేయర్ గుండు సుధారాణి గెలిచిన డివిజన్‌కు పక్కనే ఉన్నప్పటికీ ఈ శ్మశాన వాటికపై ఇంత నిర్లక్ష్యం వహించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేటర్ల విలాసవంతమైన సెల్‌ఫోన్లకు, పర్యటనలకు నిధులు ఉంటున్నాయి కానీ, ప్రజలకు అత్యంత అవసరమైన స్మశాన వాటిక మౌలిక వసతులకు నిధులు కరువయ్యాయా అని స్థానికులు నిలదీస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఘనంగా వీడ్కోలు సభలు నిర్వహించుకున్న గత పాలకవర్గం, తమ కార్యాలయానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ సమస్యను ఎందుకు గాలికొదిలేసిందో అర్థం కావడం లేదన్నారు. ఎమ్మెల్యేలు మారుతున్నా శ్మశాన వాటిక భాగ్యం మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై 11వ డివిజన్ మాజీ కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మీ సురేందర్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేశారని సమాచారం. నగరంలో రోడ్ల మీద బొమ్మల ఏర్పాటుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న అధికారులు, చనిపోయిన వారి చివరి ప్రయాణానికైనా కనీస గౌరవం ఇవ్వలేరా అని మున్సిపల్ కమిషనర్‌ను స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పక్కనే ఉన్న మరో శ్మశాన వాటికలో విద్యుత్ వెలుతురు ఉన్నప్పటికీ, హిందూ శ్మశాన వాటికను మాత్రం అంధకారంలో ఉంచడం పాలకుల వైఫల్యమేనని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి, రాత్రి వేళల్లో ఈ శ్మశాన వాటికను స్వయంగా సందర్శించి ఇక్కడి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పోతన నగర్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor