ఆంధ్ర ప్రదేశ్ · May 25, 2026

పండగ వాతావరణంలో క్లస్టర్ వేదికలుగా తెలుగుదేశం మహానాడు: జగన్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ సీనియర్ నేత సోమిరెడ్డి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

తిరుపతి,వి90న్యూస్, మే 25: ఈనెల 27, 28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే మహానాడు ఉత్సవాలను ప్రతి క్లస్టర్ వేదికగా పండగ వాతావరణంలో జరిపేందుకు భారీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీడీపీ సీనియర్ నాయకులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. తిరుపతిలో నిర్వహించిన మహానాడు సన్నాహక సమావేశంలో జోనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య, పార్లమెంటు అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా ఈసారి మహానాడును మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నారా లోకేష్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు కావడం వల్ల ఇది తమకు ఎంతో ప్రత్యేకమైనదని, తిరుపతి పార్లమెంటు పరిధిలోని 78 క్లస్టర్ల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా వర్చువల్‌గా ఈ వేడుకల్లో భాగస్వాములు కానున్నారని వివరించారు. ఎన్టీఆర్ ఆశయాలు, కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, భవిష్యత్ కార్యాచరణను ఈ మహానాడు వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.ఇదే వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 17 ఏళ్ల క్రితం హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోతే, ఇప్పుడు చంద్రబాబు నాయుడిపై జగన్ అనుమానాలు వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సూది పోయిందని సోదికి పోతే రంకు మొత్తం బయటపడినట్లు, జగన్ చేసిన ఒకే ఒక్క వ్యాఖ్యతో వైఎస్ కుటుంబానికి సంబంధించిన ఫ్యాక్షన్, రక్తచరిత్ర మొత్తం ఇప్పుడు దేశవ్యాప్తంగా వెలుగులోకి వస్తోందని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ మరణించిన సమయంలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని, అప్పటి సీఎం రోశయ్య కోరడం వల్లే ప్రధాని మన్మోహన్ సింగ్ సీబీఐ విచారణ జరిపించి అది కేవలం ప్రమాదమేనని తేల్చారని గుర్తుచేశారు. బాబాయి వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏమీ చేయలేని జగన్, ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ తన గొయ్యి తనే తవ్వుకుని నవ్వులపాలవుతున్నారని మండిపడ్డారు.రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తోందని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా కేవలం పెన్షన్ల కోసమే ఏటా రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తూ ఏపీని సంక్షేమంలో మొదటి స్థానంలో నిలిపామని సోమిరెడ్డి పేర్కొన్నారు. తల్లికి వందనం, స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద ఉచిత సిలిండర్ల పంపిణీతో పేద కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోడ్పాటు, నారా లోకేష్ పట్టుదలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే, అది ఓర్వలేకనే జగన్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో దెబ్బతిన్న అన్ని వ్యవస్థలను బాగు చేసి పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనతో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor