రైతులకు 50 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాల పంపిణీని ప్రారంభించిన జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం
జమ్మికుంట,వి90 న్యూస్,మే 25: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ పరిధిలోని జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాలకు చెందిన రైతులకు 50 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాల పంపిణీ కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో గల రైతు ఆగ్రోస్ ఎరువుల దుకాణంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న – సదానందం ముఖ్యఅతిథిగా హాజరై ఈ పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. వానాకాలం పంటల సాగు ప్రారంభానికి ముందు వ్యవసాయ భూములలో పోషక విలువలను, భూసారాన్ని పెంచేందుకు జీలుగ వంటి పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు ఎంతగానో దోహదపడతాయని వివరించారు. జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాలకు సంబంధించి మండలానికి 280 క్వింటాళ్ల చొప్పున జీలుగ విత్తనాలు సబ్సిడీపై పంపిణీకి సిద్ధంగా ఉంచామని ఆమె తెలిపారు. మార్కెట్‌లో 30 కేజీల బ్యాగు ధర రూ.2,453 లుగా ఉందని, ఈ 30 కిలోల సంచిని రైతులు రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసుకోవచ్చని పేర్కొంటూ, ఈ సబ్సిడీ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ పంపిణీ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జమ్మికుంట మండల వ్యవసాయ అధికారి ఖాదర్ హుస్సేన్, పీఏసీఎస్ జమ్మికుంట చైర్మన్ పొనగంటి సంపత్, మార్కెట్ సూపర్‌వైజర్ బాబాతో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక రైతులు పాల్గొన్నారు.

