కరీంనగర్ · May 26, 2026

పేదల సహనాన్ని పరీక్షించొద్దు.. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జమ్మికుంట,వి90 న్యూస్,మే 26: అర్హులైన లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లను పంపిణీ చేయకుండా పేదల సహనాన్ని పరీక్షించవద్దని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జమ్మికుంటలో వడ్లూరి కిషోర్ అధ్యక్షతన జరిగిన సిపిఎం మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2017-18లో నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం ప్రారంభించిందని, అందులో 80 శాతం ఇండ్లు పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా పేదలకు కేటాయించకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. ఇళ్లను పంపిణీ చేయకపోవడం వల్ల అవి ఆసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి పాలకులు అసంపూర్తిగా వదిలేసిన ఇండ్లను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసి, విద్యుత్తు, తాగునీరు, డ్రైనేజీ లాంటి మౌలిక సదుపాయాలు కల్పించి వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.రాజకీయాలకు అతీతంగా గతంలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన పేదలందరికీ ఇళ్లను కేటాయించాలని వాసుదేవరెడ్డి స్పష్టం చేశారు. పంపిణీలో ఆలస్యం జరుగుతున్న కొద్దీ ఇళ్లకు ఉన్న తలుపులు, కిటికీలు, మెటీరియల్ పాడైపోతున్నాయని, జిల్లా అధికారులు కేవలం సందర్శనలు, పరిశీలనలకే పరిమితం కాకుండా మరమ్మత్తులు పూర్తి చేసి ఇళ్లను ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారని, వారిపై నమ్మకంతో పేదలు ఇంకా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా పేదల ఓపికను పరీక్షించకుండా వెంటనే ఇళ్లను అందజేయాలని, లేనిపక్షంలో లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.అదేవిధంగా ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన అన్నదాతలు అమ్ముకోవడానికి అరిగోస పడుతున్నారని, మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. నెలరోజులుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నా పట్టించుకోవడం లేదని, తేమ, తాలు నెపంతో రైస్ మిల్లర్లు క్వింటాల్‌కు 6 నుండి 10 కిలోల వరకు కోత విధిస్తూ రైతులను దోచుకుంటుంటే అధికారులు అంటిముట్టనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. కేంద్రాల్లో కాటాలు పూర్తయినా 10 రోజులుగా ఎగుమతులు చేయకపోవడంతో రైతులు బస్తాల వద్దే కాపలా ఉంటున్నారని, ఇప్పటివరకు కొనుగోలు చేసిన పంట డబ్బులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. దీంతో పాటు వేసవి తీవ్రత దృష్ట్యా బోర్లు ఎండిపోయి, మిషన్ భగీరథ నీరు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అధికారులు వెంటనే వాటర్ ట్యాంకర్ల ద్వారా ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొప్పుల శంకర్, మండల కమిటీ సభ్యులు గండిగారి సతీష్, జక్కుల రమేష్, బసిర సంపత్ రావు, వడ్లూరి కిషోర్, మధునయ్య, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor