చిట్ ఫండ్ వ్యాపారి మోసం: అప్పుల బాధ తట్టుకోలేక యువకుడి ఆత్మహత్యాయత్నం
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,మే 30: జమ్మికుంటలో చిట్ ఫండ్ వ్యాపారి చేతిలో మోసపోయి, బ్యాంకుల నుండి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విలాసాగర్ గ్రామానికి చెందిన ఆరుకాల శంకరయ్య కుమారుడైన అరకాల సాయికుమార్, జమ్మికుంటకు చెందిన నరహరిశెట్టి రాకేష్ అనే ప్రైవేట్ చిట్ ఫండ్ నిర్వాహకుడిని నమ్మి తీవ్రంగా నష్టపోయాడు. సాయికుమార్ తనకు వచ్చిన రూ. 2,50,000 చిట్టీ డబ్బులను గడువు ముగిసినా తిరిగి ఇవ్వకుండా రాకేష్ కాలయాపన చేశాడు. అంతేకాకుండా, నమ్మకంగా ఉంటూ సాయికుమార్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా దాదాపు రూ. 3,20,000 లోన్ తీసుకోవడంతో పాటు, అతని వద్ద ఉన్న 16 గ్రాముల బంగారు గొలుసును కూడా బ్యాంకులో కుదువ పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్నాడు.ఈ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని సాయికుమార్ పలుమార్లు కోరినప్పటికీ, ప్రతివాది రాకేష్ సమాధానం దాటవేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. మరోవైపు బ్యాంకుల నుండి లోన్ల రికవరీ కోసం ఒత్తిడి పెరుగుతుండటంతో తీవ్ర మనోవేదనకు గురైన సాయికుమార్, నిన్న (మే 29) ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. బాధితుడి తండ్రి శంకరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

