ఖమ్మం · May 30, 2026

గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర ప్రమాదం: బొల్లారం కానిస్టేబుల్ దుర్మరణం, భార్యాపిల్లలకు గాయాలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

ఖమ్మం,వి90 న్యూస్,మే 30: ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలో శనివారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని రామానుజవరం గ్రామ సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ప్రయాణిస్తున్న ఒక కారు అదుపుతప్పి రహదారి ఎడమవైపు ఉన్న రేకు బారికేడును బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత కారు పలు పల్టీలు కొడుతూ హైవేపైనే ఎగిరిపడింది. ఈ ఘోర ప్రమాదంలో కారు నడుపుతున్న హైదరాబాద్ నివాసి స్వర్ణకంటి జస్వంత్ (36) అలియాస్ అశోక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడు బొల్లారం పోలీస్ స్టేషన్‌లో 2021 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.కానిస్టేబుల్ జస్వంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం దేవస్థానాన్ని దర్శించుకుని తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణమవుతుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు జస్వంత్ భార్య జ్యోతి కిరణ్ మౌనిక కాలు విరగగా, ఆరేళ్ల కుమార్తె మాన్య కాలుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే వారి నాలుగేళ్ల కుమారుడు కళ్యాణ్ రామ్ మాత్రం ఎలాంటి గాయాలు కాకుండా ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించగా, గాయపడిన భార్యాపిల్లలను తక్షణ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలిసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor