కరీంనగర్ · June 1, 2026

గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలి: హుజురాబాద్ ఎంపీడీవో కార్యాలయం ముందు సీఐటీయూ ధర్నా

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్, జూన్ 01: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హుజురాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ముందు కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం తమ న్యాయమైన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవోకు అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ, గత ఎనిమిది సంవత్సరాలుగా గ్రామపంచాయతీ కార్మికులకు ఒక్కసారి కూడా వేతనాలు పెంచకుండా ప్రభుత్వాలు వారిని తీవ్ర శ్రమ దోపిడీకి గురిచేస్తున్నాయని మండిపడ్డారు. ఒకపక్క నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతుంటే, మరోపక్క కార్మికులు కేవలం రూ. 9,500 చాలీచాలని వేతనంతో కుటుంబాలను పోషించలేక తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రామపంచాయతీ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కనీస వేతనం రూ. 26,000 అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులందరినీ రెండో పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలని, ప్రస్తుతం ఉన్న మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే కేటగిరీల వారీగా పనులు కేటాయించాలని కోరారు.

అలాగే విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే ప్రభుత్వం తరఫున రూ. 20 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, దహన సంస్కారాల నిమిత్తం తక్షణ సహాయంగా రూ. 30 వేలు అందించాలని డిమాండ్ చేశారు. ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు కాని కార్మికుల వివరాలను వెంటనే నమోదు చేయడంతో పాటు, అందరికీ పీఎఫ్, ఈఎస్‌ఐ సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే రాబోయే రోజుల్లో దశలవారీగా ఆందోళనలను, పోరాటాలను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ మండల అధ్యక్షులు ఆకునూరి సుధాకర్, మండల కార్యదర్శి చొప్పదండి బిక్షపతి, జిల్లా కమిటీ సభ్యులు శనిగరపు కొమురయ్య, ఇమ్మడి శ్రీకాంత్, మరియు కార్మికులు మనక్క, మాడుగుల ఉమా, మిడిదొడ్డి శ్రీనివాస్, ఎల్లయ్య తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor