టెక్నాలజీ · June 2, 2026

పోలీసులు ప్రజలకు మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలు అందించాలి: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి ఐపీఎస్ ఆదేశం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

రంగారెడ్డి/షాద్ నగర్,వి90 న్యూస్,జూన్ 02: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని షాద్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి, ఐపీఎస్ మంగళవారం నాడు అకస్మాత్తుగా సందర్శించి స్టేషన్ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో శాంతిభద్రతల నిర్వహణ, నేరాల దర్యాప్తు, నివారణ చర్యలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు, వినతిపత్రాల పరిష్కారం, నేర గణాంకాలు మరియు శాఖాపరమైన కార్యక్రమాల అమలు తీరుపై అధికారులతో సమీక్ష చేపట్టారు.

పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో, ప్రజామిత్ర విధానంలో సేవలు అందించాలని ఆయన సూచించారు. బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించడంతో పాటు నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. పట్టణంలో బీట్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసి, ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగించాలని కమిషనర్ స్పష్టం చేశారు. గ్రామ పోలీసు అధికారులు (వీపీఓలు) తమ పరిధిలోని గ్రామాల్లో సమాచార సేకరణను ముమ్మరం చేసి, అనుమానాస్పద కదలికలు, అసాంఘిక కార్యకలాపాలపై వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు.

గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలతో సమన్వయం పెంచుకుని, సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రౌడీషీటర్లు, అలవాటు నేరస్తులు, సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిఘా మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మాదకద్రవ్యాల వ్యాప్తి, అక్రమ కార్యకలాపాలు, సైబర్ నేరాలు, జూదం తదితర నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కమిషనర్ పేర్కొన్నారు. మహిళల భద్రత, బాలల రక్షణ, వృద్ధుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని, వాటిపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

నేరాల ఛేదన, దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ టూల్స్ వినియోగాన్ని పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమాజంలో శాంతి భద్రతలు, సామరస్య వాతావరణం, ప్రజా శాంతి పరిరక్షణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రతి పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, నిజాయితీ, వృత్తి నైపుణ్యంతో విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పోలీస్ స్టేషన్ పనితీరుపై కమిషనర్ తరుణ్ జోషి సంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ జోన్ డీసీపీ షిరీషా రాఘవేంద్ర, షాద్‌నగర్ డివిజన్ ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ సీతారాం తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor