తెలంగాణ · June 19, 2026

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు వెంటనే అందించాలి: ఎస్ఎఫ్ఐ డిమాండ్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హనుమకొండ,వి90 న్యూస్,జూన్ 19: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు వెంటనే పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, స్కూల్ బ్యాగులు అందించాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్టాలిన్, మంద శ్రీకాంత్ డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం గుండ్లసింగారంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమై నాలుగు ఐదు రోజులు గడుస్తున్నా విద్యార్థులకు అందాల్సిన కనీస వస్తువులు చేరకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వ విద్యా రంగ సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని, వారి విధానాలు ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసేలా ఉన్నాయని మండిపడ్డారు.

విద్యాసంస్థలు ప్రారంభం కాకముందు నుంచే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఇష్టారాజ్యంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అమ్ముతున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం పేద విద్యార్థుల పక్షాన ఉందా, లేక కార్పొరేట్ విద్యాసంస్థల పక్షాన ఉందా అని వారు ప్రశ్నించారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీరు, మరుగుదొడ్లు, స్పోర్ట్స్ కిట్స్, కంప్యూటర్ ల్యాబ్స్, గ్రౌండ్స్ లేకపోవడంతో పాటు తరగతి గదుల్లో ఫ్యాన్లు, లైట్లు, సరిపడా ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ స్పందించి పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, స్కూల్ బెల్టులు, బ్యాగులు త్వరగా అందించాలని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో విద్యార్థులను ఉమ్మడిగా సమీకరించి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు, జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) కార్యాలయాన్ని పెద్ద ఎత్తున ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉధృత ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు చెన్నూరి సాయికుమార్, కుమార్, అనుఫు రణదీప్, అభిషేక్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor