హన్మకొండ,వి90 న్యూస్,సెప్టెంబర్ 16: డిజిటల్ ఇండియా నినాదంతో అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు సామాన్య ప్రజలు, మధ్యతరగతి వర్గాలు, చిన్న వ్యాపారుల నడ్డి విరిచేలా యూపీఐ లావాదేవీలపై పరోక్షంగా ఛార్జీల భారాన్ని మోపేందుకు సిద్ధమైందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. బుధవారం హనుమకొండలోని కాళోజీ సెంటర్ లో కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న యూపీఐ ఛార్జీలకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లకార్డులు తో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు.అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ, రూ. 2,000 మించిన యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేసేందుకు మార్గం సుగమం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్న డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను సంక్లిష్టం చేస్తూ, విదేశీ కార్పొరేట్ దిగ్గజాలకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. వేల కోట్ల ఆదాయం ఆర్జిస్తున్న కార్పొరేషన్ల నుంచి రుసుములు వసూలు చేయాల్సింది పోయి, సామాన్యులపై భారం మోపడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ ప్రతిపాదనలను విరమించుకుని యూపీఐ సేవలను ఉచితంగా కొనసాగించాలని, లేనిపక్షంలో ప్రజలను సమీకరించి పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర సమితి సభ్యులు , పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

