ఆరోగ్యం · September 18, 2026

రోగుల భద్రత, సురక్షిత వైద్యసేవలపై జమ్మికుంటలో అవగాహన సదస్సు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 18: జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయంలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ చందన ఆధ్వర్యంలో ‘ప్రపంచ పేషంట్ సేఫ్టీ డే’ పురస్కరించుకుని ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హుజూరాబాద్ డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రభుదాస్ మాట్లాడుతూ, వైద్య సేవలు పొందే ప్రతి రోగికి సురక్షితమైన, నాణ్యమైన చికిత్స అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. చికిత్స, మందుల వాడకం , రోగ నిర్ధారణ సమయంలో జరిగే పొరపాట్లను నివారించాలని సూచించారు. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ , శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి సురక్షిత వైద్యం అందేలా చూడాలని, వైద్య నిర్ణయాల్లో రోగులతో పాటు వారి కుటుంబ సభ్యులను భాగస్వాములను చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని స్పష్టం చేశారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు వైద్య శిబిరం నిర్వహించి రక్తపోటు, మధుమేహం తదితర పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

అలాగే పట్టణంలోని వడ్డెర కాలనీలో డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రభుదాస్ , వైద్య సిబ్బంది ప్రజలకు ‘డ్రై డే ఫ్రైడే’, ‘డ్రై డే ట్యూస్‌డే’ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ప్రతి వారం క్రమం తప్పకుండా డ్రై డే పాటించడం ద్వారా దోమల ఉత్పత్తిని అరికట్టి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, అనారోగ్యం బారిన పడితే తక్షణమే సమీప ప్రభుత్వ వైద్య సిబ్బందిని సంప్రదించి చికిత్స పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు సదానందం, శరత్, డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ గౌడ్, సబ్ యూనిట్ ఆఫీసర్ రాజేందర్ రాజు, ఆరోగ్య సిబ్బంది సాజిదా పర్వీన్, నరేందర్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor