కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 22: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం కొత్త పత్తి కొనుగోళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ గ్రామాల నుంచి రైతులు తీసుకొచ్చిన పత్తికి మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న-సదానందం కొబ్బరికాయలు కొట్టి, ముహూర్తం చేసి కొనుగోళ్లను శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కొత్త పత్తిని మార్కెట్‌కు తీసుకొచ్చిన ఇల్లందకుంట మండలం మర్రివానిపల్లికి చెందిన కలాల గణపతి రెడ్డి, పైండ్ల తిరుపతి రెడ్డి, అలాగే సిరిసేడుకు చెందిన బీనవేని కొమురయ్య అనే రైతులకు చైర్‌పర్సన్ శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి, తీపి పదార్థాలు తినిపించారు.

బహిరంగ వేలంపాటలో కొత్త పత్తికి క్వింటాలుకు గరిష్టంగా రూ.7,272, కనిష్టంగా రూ.7,011 ధర లభించింది. ఈ పత్తిని మురళీకృష్ణ ట్రేడర్స్, మల్లికార్జున ట్రేడర్స్ వ్యాపారులు కొనుగోలు చేశారు. అనంతరం చైర్‌పర్సన్ మాట్లాడుతూ, స్థానిక వ్యాపారులతో పాటు ఇతర ప్రాంతాల లైసెన్స్ కలిగిన వ్యాపారులు కూడా జమ్మికుంట మార్కెట్‌కు వచ్చి పత్తిని కొనుగోలు చేయవచ్చని పిలుపునిచ్చారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులకు మార్కెట్ పాలకవర్గం తరఫున అన్ని రకాల వసతులు, సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా పండించిన పంటను నేరుగా మార్కెట్ యార్డుకే తీసుకొచ్చి మద్దతు ధర పొంది లాభపడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి ఆర్. మల్లేశం, ద్వితీయ శ్రేణి కార్యదర్శి ఎన్. రాజా, అడ్తి, హమాలి, దాడువైల సంఘం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావులతో పాటు మార్కెట్ కమిటీ సభ్యులు, సిబ్బంది, వ్యాపారులు, అడ్తిదారులు, గుమాస్తాలు, కార్మికులు , రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

