సంగారెడ్డి,వి90 న్యూస్,సెప్టెంబర్ 27: జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) నిరంతరం పోరాటం చేస్తుందని సంఘం రాష్ట్ర యాక్టింగ్ కమిటీ అధ్యక్షుడు పి. రాంచందర్ స్పష్టం చేశారు. నారాయణఖేడ్ పట్టణంలోని విశ్వకర్మ భవన్‌లో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మునిగాల మాణిక్ ప్రభు అధ్యక్షతన నిర్వహించిన నారాయణఖేడ్ డివిజన్ 3వ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే క్రమంలో జర్నలిస్టులు అనేక సవాళ్లు, ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారని పి. రాంచందర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్, హెల్త్ కార్డులు, రైల్వే రాయితీలతో పాటు ఉచిత ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫెడరేషన్ చేపట్టిన పోరాటాల ఫలితంగానే నారాయణఖేడ్ డివిజన్‌లో ఇప్పటికే కొందరికి ఇళ్ల స్థలాలు లభించాయని, మిగిలిన అర్హులందరికీ స్థలాలు వచ్చే వరకు తమ పోరాటం ఆగేది లేదని తేల్చి చెప్పారు.అనంతరం టీడబ్ల్యూజేఎఫ్ నాయకుల బృందం నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలసి వినతిపత్రం సమర్పించింది. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణంలో ఉన్న ఇళ్లకు పెండింగ్ బిల్లుల మంజూరు, జర్నలిస్టు కాలనీల్లో మౌలిక వసతుల కల్పనపై ఎమ్మెల్యేతో చర్చించారు. ఈ వినతిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు స్థలాలు కేటాయించడంతో పాటు వసతుల కల్పనకు తమ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు సుదర్శన్ రెడ్డి, నాయకులు మేకల కృష్ణయ్య, పాండు, జి. రఘు, బి. రాజశేఖర్, రాజు గౌడ్, యం.ఏ ఖైసర్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

