సిద్దిపేట/హుస్నాబాద్,వి90 న్యూస్,అక్టోబర్ 09: హుస్నాబాద్ నియోజకవర్గంలోని అర్హులైన దివ్యాంగులు, వృద్ధులకు ‘అలిమ్కో’ (ALIMCO) సహకారంతో అడిప్ (ADIP) పథకం కింద ఉచిత సహాయ పరికరాలు అందించేందుకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ఒక్క అర్హుడు కూడా మిగిలిపోకుండా ప్రతి గ్రామంలో లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించాలని అధికారులను ఆదేశించారు. వీల్చైర్లు, వినికిడి పరికరాలు, ట్రైసైకిళ్లు, వాకింగ్ స్టిక్స్, కళ్లద్దాలు, కృత్రిమ అవయవాలు తదితర పరికరాలను అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా 80 శాతానికి పైగా వైకల్యం ఉన్న అర్హులకు ఎలక్ట్రిక్ ట్రైసైకిళ్లు అందజేసేలా ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.

ఈ నెల 15వ తేదీలోపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. మండలాల వారీగా పంపిణీ కేంద్రాలను వర్గీకరిస్తూ… హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల ప్రజలకు హుస్నాబాద్‌లో, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలకు ముల్కనూరులో, చిగురుమామిడి, సైదాపూర్ మండలాల వారికి సౌకర్యవంతంగా ఉండే మరో ప్రాంతంలో పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. పంపిణీ రోజున లబ్ధిదారులను ప్రత్యేక బస్సుల ద్వారా ఉచితంగా పంపిణీ కేంద్రాలకు తీసుకురావడంతో పాటు వారికి భోజన, వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం ఫలాలు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

