రాజన్న సిరిసిల్ల/వేములవాడ/వి90 న్యూస్/ అక్టోబర్ 11: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఆలయ డిఈఓ శ్రీ ప్రతాప నవీన్ కుమార్ సమక్షంలో ఉదయం స్వస్తి పుణ్యాహవాచనం, అఖండ దీపస్థాపన, కలశ ప్రతిష్ట వంటి కార్యక్రమాలను నిర్వహించారు.

ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారు శ్రీ శైలపుత్రిదేవి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. శ్రీ లక్ష్మీ గణపతికి మహాఅభిషేకం, శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తూ, ఋత్విజులచే గాయత్రీ హవనం, లలితా సహస్రనామ అర్చనలు, దేవీ చండీ సప్తశతీ పారాయణాలు పూర్తి చేశారు. ఆలయంలోని పరివార దేవతలకు కూడా విశేష అభిషేకాలు నిర్వహించారు.

సాయంత్రం సమయంలో భీమేశ్వరాలయంలో దేవీభాగవత పురాణ ప్రవచనం, అమ్మవారికి చతుష్షష్ట్యోపచార పూజలు, కన్యాక-సువాసినీ పూజలు మరియు హరిహరుల ఉత్సవ మూర్తుల పల్లకీ సేవ ఊరేగింపు ఘనంగా జరిగింది.

మరోవైపు దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అమ్మవారి ఉత్సవ మూర్తిని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 20 వరకు జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా భక్తుల కోసం రూ. 5,000/- టికెట్ రుసుముతో ప్రత్యేక కుంకుమ పూజల సేవను అందుబాటులోకి తెచ్చినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. భక్తులందరూ విశేష సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్ల కృపాకటాక్షాలు పొందాలని ఆలయ పి.ఆర్.ఓ పెరిక శ్రీనివాస్ కోరారు.

