హైదరాబాద్/వి90న్యూస్/అక్టోబర్ 11: శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల శుభసందర్భంగా హైదరాబాద్‌లోని ప్రముఖ బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ పోచమ్మ ఆలయాన్ని రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. నవరాత్రి ఉత్సవాల తొలి రోజున శ్రీ బాలా త్రిపురసుందరి దేవి అలంకారంలో దీపాల కాంతులతో సుందరంగా దర్శనమిచ్చిన అమ్మవారిని ఆయన భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున ప్రజలకు ఎలాంటి తాగు, సాగునీటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజాపాలన ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా కొనసాగాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారి పాదాల చెంత ప్రార్థించినట్లు వెల్లడించారు.

