హన్మకొండ/కమలాపూర్/వి90 న్యూస్/ అక్టోబర్ 12: కమలాపూర్ మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, పేద కుటుంబాలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా కొనసాగించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందించాలని డిమాండ్ చేశారు.పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1,00,116 ఆర్థిక సహాయంతో పాటు ఇస్తామన్న తులం బంగారాన్ని వెంటనే అందించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు.

అలాగే ఉచిత 24 గంటల విద్యుత్ హామీని విస్మరించి కేవలం 7 గంటలే ఇస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని వెంటనే విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని స్పష్టం చేశారు.దళితుల అభ్యున్నతి కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు రెండో విడతను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గర్భిణులు, నవజాత శిశువుల ఆరోగ్యం కోసం గతంలో అమలు చేసిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పథకాలను పునఃప్రారంభించాలని కోరారు. కమలాపూర్‌లో పంపిణీ చేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, 90 శాతం పూర్తయిన కమలాపూర్ బస్‌స్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వెంటనే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా సంక్షేమాన్ని ప్రాధాన్యతగా తీసుకుని పెండింగ్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

