వరంగల్/వి90 న్యూస్/అక్టోబర్ 12: వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అజాం జాహి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం “ఆపరేషన్ చెబుత్రా” నిర్వహించారు. చింతల్, అబ్బనికుంట, లేబర్ కాలనీ, ఫోర్ట్ వరంగల్, శివనగర్, కరీమాబాద్, శంభునిపేట తదితర ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి వేళల్లో అనవసరంగా రోడ్లపై తిరుగుతూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న 28 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి నుంచి 10 మోటార్ సైకిళ్లు, 24 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.

అదుపులోకి తీసుకున్న వ్యక్తులకు కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. రాత్రి వేళల్లో అనవసరంగా తిరగడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించి, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని కోరారు. మైనర్లు వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, రోడ్లపై పుట్టినరోజు వేడుకల పేరుతో బాణసంచా కాల్చి హంగామా సృష్టించడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ప్రజలకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

