తెలంగాణ · October 26, 2026

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ఉచ్చులో పడి యువకుడి బలి: భార్య, కన్నకూతురిని విడిచిపెట్టి ఇంట్లోనే బలవన్మరణం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

యాదాద్రి భువనగిరి/వి90 న్యూస్/అక్టోబర్ 26: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం ఒక పచ్చని కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో బెట్టింగ్ యాప్‌ల బారిన పడి, భారీగా డబ్బులు నష్టపోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక యువకుడు చివరకు మార్గం కానరాక ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.రాజాపేట మండలం రేణుకుంట గ్రామానికి చెందిన 35 ఏళ్ల గంధమల్ల భరత్ ఉపాధి, నివాసం నిమిత్తం భువనగిరి పట్టణంలోని బంజారాహిల్స్ కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని భార్యాపిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. కొద్దికాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు అలవాటు పడిన భరత్, అందులో పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోయాడు. పోయిన డబ్బును తిరిగి సంపాదించాలనే ఆలోచనతో మరింతగా బెట్టింగులు కాసి తీవ్రమైన అప్పుల భారంలో పడిపోయాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలోనే జీవితంపై విసిగిపోయిన భరత్ తన అద్దె ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు తన భార్యకు వాట్సాప్‌లో మెసేజ్ పంపడంతో పాటు ఒక సూసైడ్ నోట్ కూడా రాసి పెట్టాడు. బెట్టింగ్ వ్యసనం నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదని, అప్పుల భారం వల్ల భార్యకు, కన్నకూతురికి ముఖం చూపించలేకపోతున్నానని లేఖలో అత్యంత ఆవేదనగా పేర్కొన్నాడు. “నన్ను క్షమించు, పాపను జాగ్రత్తగా చూసుకో” అంటూ రాసిన లేఖ కుటుంబ సభ్యులను కంటతడి పెట్టించింది. చిన్నారి కూతురు, భార్యను విడిచిపెట్టి భరత్ ఆత్మహత్యకు పాల్పడటంతో రేణుకుంట గ్రామంలోనూ, భువనగిరిలోనూ శోకసంద్రం అలుముకుంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఘటనతో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల పట్ల యువత, కుటుంబాలు అప్రమత్తంగా ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor