హైదరాబాద్/వి90న్యూస్/నవంబర్ 04: హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద విషాదకర వాతావరణం నెలకొంది. ఇటీవల జరిగిన ప్రమాదంలో అకాల మరణం చెందిన ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక పార్థివదేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ,పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు , ఆర్టీసీ ఉద్యోగులు అశ్రునయనాల మధ్య ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా తీవ్ర దుఃఖంలో ఉన్న ప్రవళిక తల్లిని, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ప్రవళిక హఠాన్మరణం తీవ్రంగా కలచివేసిందని, ఈ కష్టసమయంలో ఆర్టీసీ కుటుంబం యావత్తు ఆ కుటుంబానికి కొండంత అండగా ఉంటుందని యాజమాన్యం దృఢమైన హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి ప్రభుత్వం , ఆర్టీసీ తరఫున సమగ్ర సహాయక చర్యలను ప్రకటించారు. ప్రవళిక తల్లికి జీవనోపాధి కల్పించేందుకు గాను ప్రభుత్వ ఉద్యోగ నియామకంతో పాటు, వారి నివాస అవసరాల కోసం ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.

ఆర్థిక సాయం కింద ప్రభుత్వం , ఆర్టీసీ సంస్థల భాగస్వామ్యంతో రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా తక్షణమే అందజేయనున్నారు. దీంతో పాటు ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంలో భాగంగా, బ్యాంక్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ విధానం ద్వారా మరో రూ. 1 కోటి రూపాయల ప్రమాద భీమా పరిహారం బాధిత కుటుంబానికి అందనుంది. ప్రభుత్వం నుంచి లభించే ఈ బహుముఖ సహాయం ప్రవళిక కుటుంబానికి తీవ్ర లోటును భర్తీ చేయలేకపోయినా, భవిష్యత్తుకు ఆర్థిక ధీమాను ఇస్తుందని అధికారులు పేర్కొన్నారు.

