కరీంనగర్/హుజురాబాద్/వి90 న్యూస్/ నవంబర్ 11: వృద్ధాప్యం అనేది జీవితానికి ముగింపు కాదని, అనుభవాల సారాన్ని సమాజానికి అందించే అపూర్వమైన దశ అని బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. బ్రహ్మకుమారీస్ సామాజిక సేవా విభాగం, భారత ప్రభుత్వ సామాజిక న్యాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సంగం’ కార్యక్రమంలో భాగంగా బుధవారం హుజురాబాద్ కేంద్రంలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా బ్రహ్మకుమారి కల్పన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం అనేక ప్రాంతాల్లో విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు.

వయసు పెరిగినంత మాత్రాన ఉత్సాహం తగ్గాల్సిన అవసరం లేదని, అరవై ఏళ్లు దాటిన పెద్దలు తమ అనుభవం, జ్ఞానంతో సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలని పిలుపునిచ్చారు. సదస్సులో పాల్గొన్న వక్తలు మాట్లాడు తలపై నెరిసిన వెంట్రుకలు, ముడతలు బలహీనతకు గుర్తులు కావు అని, జీవితంలో సాధించిన విజయాలకు ప్రతీకలని స్పష్టం చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత లభించే సమయాన్ని ఆత్మపరిశీలన, ఆధ్యాత్మిక చింతన, నూతన నైపుణ్యాల పెంపొందింపునకు వినియోగించుకోవాలని సూచించారు. మనసులోని ప్రతికూల ఆలోచనలను తొలగించి, క్షమాగుణాన్ని అలవర్చుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చని నెల్సన్ మండేలా జీవితాన్ని ఉదాహరించారు. ప్రతిరోజూ రాజయోగ ధ్యానం చేయడం, సాత్విక ఆహారం తీసుకోవడం, సత్సంగంలో పాల్గొనడం వల్ల వృద్ధాప్యంలో ఆరోగ్యం, ప్రశాంతత లభిస్తాయని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వంటి ప్రముఖులను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం హాజరైన సీనియర్ సిటిజన్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఇన్‌చార్జి శ్రీవాణి, గుంటి రాజయ్య, శివనాధుని ఈశ్వరయ్య, జ్యోతిరాణి తదితరులు పాల్గొన్నారు.

