తెలంగాణ · November 11, 2026

త్వరలోనే మూసీ రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభం: జాతీయ విద్యా దినోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్/వి90న్యూస్/నవంబర్ 11: మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వెల్లడించారు. భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర మైనారిటీ శాఖ హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆజాద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి అంజలి ఘటించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మూసీని అత్యంత సుందరమైన రివర్ ఫ్రంట్‌గా తీర్చిదిద్దడమే కాకుండా, ఆ పరిసరాల్లో నైట్ ఎకానమీని అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటు దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని వివరించారు. పాతబస్తీ గత వైభవాన్ని పునరుద్ధరించేలా దేశ విదేశీ సందర్శకులను ఆకట్టుకునేలా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.

అలాగే వచ్చే రెండు నెలల్లో గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో రైలు విస్తరణ పనులు ప్రారంభిస్తామని, మీరాలం ట్యాంక్‌ను మరో ఏడాది కాలంలో అత్యంత సుందరమైన ప్రదేశంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. హైదరాబాద్‌లోని నిరుపేదల కోసం ఒక లక్ష ఇందిరమ్మ ఇండ్లను నిర్మించబోతున్నామని స్పష్టం చేశారు.స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పండిత్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారని, ఆ కాలంలోనే దేశంలో ఐఐటీల స్థాపనతో పాటు విద్యా విధానానికి బలమైన పునాదులు పడ్డాయని సీఎం గుర్తుచేశారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా కేవలం చదువు ఒక్కటే సరిపోదని, ప్రపంచ వ్యాప్తంగా నైపుణ్యాలు ఉన్నవారికే అవకాశాలు దక్కుతున్నాయని అన్నారు. అందుకే నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు, ఆ తర్వాత నైపుణ్యాలు, ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిచ్చేలా విద్యా రంగంలో సంస్కరణలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలోని ఐటీఐలను ఏటీసీలుగా తీర్చిదిద్దడంతో పాటు, స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలను అందుబాటులోకి తెచ్చామని వివరించారు.

దేశ జనాభాలో 15 శాతం ఉన్న మైనారిటీ వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం ముందడుగు వేస్తుందని, పేదరికాన్ని నిర్మూలించేందుకే సచార్ కమిటీ సిఫారసుల మేరకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్ అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, వి. హనుమంతరావు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, TGMREIS వైస్ చైర్మన్ ఫహీం ఖురేషీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లు, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor