హైదరాబాద్/వి90న్యూస్/నవంబర్ 11: విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్రంలో విద్యా సంస్కరణలు చేపడుతున్నామని, వచ్చే ఏడాది నుంచి 12వ తరగతి వరకు విద్యా విధానాన్ని అమలు చేయనున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. నర్సరీ నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు నాణ్యమైన విద్యాబోధన అందించి, ఆధునిక ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యా శాఖపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన విధానంలో నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్య, 5 నుంచి 8 వరకు సెకండరీ, 9 నుంచి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీగా వర్గీకరించనున్నట్లు సీఎం తెలిపారు. 10వ తరగతి తర్వాత నిష్క్రమించే విద్యార్థుల (డ్రాపౌట్స్) సంఖ్యను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, దేశంలోని 18 రాష్ట్రాల్లో ఇదే విధానం అమలులో ఉందని పేర్కొన్నారు. ఈ మార్పుల వల్ల జూనియర్ కళాశాలల లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది ఉద్యోగ, పదవీ విరమణ ప్రయోజనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగడానికి వీల్లేదని, సొంత భవనాల నిర్మాణానికి తగిన నిధులు విడుదల చేస్తామని చెప్పారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల (YIIRS) నిర్మాణ పనుల్లో వేగం పెంచి, నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే ఐటీఐలను ఏటీసీలుగా మార్చడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగాయని, పాలిటెక్నిక్‌ల ఆధునీకరణకు నిధుల విడుదలను వేగవంతం చేయాలన్నారు. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల నియామక ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని విద్యా మండలి ఛైర్మన్, వీసీలను కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, పి. సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, పలు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

