హైదరాబాద్/వి90న్యూస్/నవంబర్ 14: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులంతా ఏకమై కలిసికట్టుగా పోరాటం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో రెండు రోజుల పాటు జరిగిన ‘భారత్ సమ్మిట్-2026’ ముగింపు సమావేశంలో ‘డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్’ అన్న అంశంపై ఆయన కీలక ప్రసంగం చేశారు.

ఒకే ఆలోచనా ధోరణి కలిగిన జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి భారత్ సమ్మిట్ గొప్ప వేదికగా నిలుస్తోందని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకునే శక్తులకు, రాజ్యాంగాన్ని విధ్వంసం చేసి నియంతృత్వాన్ని రుద్దాలనుకునే శక్తులకు మధ్య ప్రధానంగా పోరాటం సాగుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. పేదలు, మహిళలు, మైనారిటీలు, రైతుల రక్షణ కోసం తాము పనిచేస్తుంటే, నియంతృత్వ శక్తులు మాత్రం కొందరు మిలియనీర్ మిత్రులను కాపాడుకోవాలన్న తాపత్రయంతో అధికారాన్ని కేంద్రీకృతం చేసుకుంటున్నాయని విమర్శించారు.

ఏకపార్టీ, ఏకవ్యక్తి పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరాటంలో ప్రపంచంలో ఏ శక్తీ తమను నిలువరించలేదని ఆయన స్పష్టం చేశారు.ప్రపంచీకరణ, కోవిడ్ అనంతర పరిణామాలతో అన్ని దేశాల్లోని సామాన్య ప్రజలు ప్రాథమిక హక్కులపై దాడులు, విద్య, ఉపాధి, వైద్యం, ద్రవ్యోల్బణం వంటి ఒకే రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని సీఎం వివరించారు. ప్రభుత్వాలు సంపన్నుల కోసం కాకుండా సామాన్య ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని ఉద్ఘాటించారు.

70 దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులను ఈ సదస్సుకు ఆహ్వానించగా, కేంద్ర ప్రభుత్వం కొందరికి వీసాలను నిరాకరించిందని, అయినప్పటికీ ప్రపంచమంతా ఈ వేడుకను వీక్షిస్తోందని తెలిపారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి రోజున ఈ సదస్సు జరగడం ఎంతో ప్రత్యేకమని, దేశంలో రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక వ్యవస్థ బలోపేతానికి ఆయన దార్శనికత ఎంతో దోహదపడిందని ముఖ్యమంత్రి కొనియాడారు.

