కరీంనగర్/వి90 న్యూస్/నవంబర్ 16: నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణ , ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు కరీంనగర్ సీపీ గౌస్ ఆలం ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సీఐ సంజీవ్ ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీలలో భాగంగా వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాటిని, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారులను, మితిమీరిన వేగంతో (ఓవర్ స్పీడ్) ప్రయాణిస్తున్న వారిని, మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వారిని పోలీసులు గుర్తించి సుమారు 110 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన వాహనాలలో నెంబర్ ప్లేట్లు లేని వాహనదారులు, అక్కడికక్కడే నెంబర్ ప్లేట్లు తెచ్చుకొని తమ వాహనాలకు బిగించుకున్న తర్వాత, ఆ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను పూర్తిగా వసూలు చేసి పోలీసులు వదిలిపెట్టారు. సరైన పత్రాలు లేని , ఇతర నిబంధనలు ఉల్లంఘించిన మిగిలిన వాహనాలపై చట్టపరమైన కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ సంజీవ్ మాట్లాడుతూ, వాహనదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఒక్క వాహన యజమాని తప్పనిసరిగా వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను (ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్) ఎల్లప్పుడూ తమ వెంట ఉంచుకోవాలని, నిబంధనల ప్రకారం వాహన నెంబర్ ప్లేట్లను స్పష్టంగా కనిపించేలా అమర్చుకోవాలని పేర్కొన్నారు.

అదేవిధంగా వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదని ఆయన హెచ్చరించారు. ఈ తనిఖీలలో ట్రాఫిక్ ఎస్ఐ, ఏఎస్ఐ , ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

