కరీంనగర్/ఇల్లందకుంట/వి90 న్యూస్/ నవంబర్ 19: మహిళా సాధికారత దిశగా మరో ముందడుగు పడింది. ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని గ్రామ సర్పంచ్ రేణుకుంట్ల శ్యామల–కుమార్ గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గతంలో గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులు సరైన వసతి లేక చెట్ల కింద సమావేశాలు నిర్వహిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని గుర్తు చేశారు. ఇప్పుడు నూతన భవనం అందుబాటులోకి రావడంతో మహిళలకు ఆ కష్టాలు తీరాయని, ఇది వారికి ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని తెలిపారు.

మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధితో పాటు స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు ఈ భవనం ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, మహిళా సంఘాల నాయకులు, సభ్యులు , గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

