వెంకటాచలం నగర వనాన్ని రాష్ట్రంలోనే మేటిగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
నెల్లూరు, వి90 న్యూస్ మే 15: నెల్లూరు నగరంలోని వేదాయపాళెం కార్యాలయంలో అటవీ, డ్వామా, నుడా అధికారులతో కలిసి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. వెంకటాచలం వద్ద చేపట్టిన నగర వనం పనుల పురోగతిని ఈ సందర్భంగా అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి, నగర వనంకు పూర్తిస్థాయిలో పర్యాటక శోభ తీసుకురావాలని సోమిరెడ్డి అధికారులను ఆదేశించారు.అటవీ శాఖ, డ్వామా, నుడా నిధులతో పాటు పనుల కోసం సీఎస్ఆర్ (CSR) నిధుల వినియోగంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. పనుల నిర్వహణకు అవసరమైన అదనపు నిధుల కోసం సోమిరెడ్డి సమావేశం నుండే అదానీ ఫౌండేషన్ , SEIL కంపెనీ ప్రతినిధులతో ఫోన్ ద్వారా మాట్లాడి, సీఎస్ఆర్ నిధులు కేటాయించాలని కోరారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వెంకటాచలం నగర వనాన్ని రాష్ట్రంలోనే ఒక ఉత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అటవీ శాఖాధికారి మహబూబ్ బాషా, రేంజర్ మాల్యాద్రి, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్, ఏపీడీ గాయత్రి, ఎంపీడీఓ కల్పన, నుడా డీఈ బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు.
