ముంబై/వి90 న్యూస్/అక్టోబర్ 26: ముంబైలోని సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ల నేతృత్వంలో రెండు రాష్ట్రాల ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాల సమావేశం ముగిసింది. ప్రాణహిత నదిపై నిర్మించతలపెట్టిన తుమ్మిడిహెట్టి బ్యారేజీకి సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.సమావేశం ప్రారంభంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్థిక వెనుకబాటుతనం, గిరిజనుల జీవన పరిస్థితులను వివరించారు.

దశాబ్దాలుగా ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి ఎద్దడిని తీర్చడానికి ప్రాజెక్టు ఎత్తును 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచాల్సిన ఆవశ్యకతను తెలిపారు. గ్రావిటీ ద్వారా నీటిని తరలించడం వల్ల విద్యుత్ ఆదా కావడంతో పాటు నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుందని స్పష్టం చేశారు. బ్యారేజీ నిర్మాణం వల్ల మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు ఆ రాష్ట్ర భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హామీ ఇచ్చారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ, మహారాష్ట్రల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక అనుబంధాన్ని ప్రస్తావించారు.

కొమురం భీమ్ సాగించిన జల్, జంగిల్, జమీన్ పోరాట సమయం నుంచి ఆదిలాబాద్ ప్రాంత ప్రజలు నీటి సౌకర్యాల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదని, రెండు రాష్ట్రాలను భౌతికంగా, ఆర్థికంగా అనుసంధానించే వారధి అని అభివర్ణించారు. ఆదిలాబాద్లో ప్రతిపాదిత రక్షణ, పౌర విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉమ్మడి జిల్లాతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు కూడా తీవ్ర ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.తెలంగాణ ప్రతిపాదనలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు.

తెలంగాణతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, తమ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకపోతే 148 మీటర్ల ఎత్తు ఒప్పందాన్ని పునఃపరిశీలించడానికి తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. జాతీయ ప్రయోజనాలు, స్నేహభావంతో ముందుకు వెళ్తామని చెప్పారు.ఈ క్రమంలో ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, పరిపాలనాపరమైన అంశాలను అధ్యయనం చేయడానికి ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో అధికారుల ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేయాలని ఫడ్నవీస్ ప్రతిపాదించారు. ఈ కమిటీ బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యత, ముంపునకు గురయ్యే భూముల విస్తీర్ణం, పరిహారం వంటి అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక రూపొందిస్తుందని తెలిపారు. కేంద్ర జల సంఘం (CWC) పరిశీలనలతో పాటు ఈ కమిటీ ప్రతిపాదనల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. గిరిజనులు, వెనుకబడిన వర్గాల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా కృషి చేయాలని ఇరువురు ముఖ్యమంత్రులు నిర్ణయించారు.

