ఆంధ్ర ప్రదేశ్ · June 1, 2026

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ పరిధిలోకి విజయవాడ డివిజన్: జూన్ 1 నుంచి నూతన శకం ఆరంభం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

విజయవాడ,వి90 న్యూస్, జూన్ 01: దక్షిణ మధ్య రైల్వేలోనే అత్యంత కీలకమైన, అత్యధిక ఆదాయం కలిగిన విజయవాడ రైల్వే డివిజన్‌లో జూన్ 01వ తేదీ నుంచి నూతన శకం ఆరంభం కాబోతోంది. ఇప్పటివరకు సికింద్రాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వేతో కొనసాగిన సుదీర్ఘ అనుబంధం ముగియడంతో, ఇకపై ఈ డివిజన్ కార్యకలాపాలు కొత్తగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి మారనున్నాయి. అన్ని ప్రాంతాలను అనుసంధానిస్తూ అత్యంత రద్దీగా ఉండే ఈ రైల్వే కూడలి ద్వారా ఏటా దాదాపు రూ. 5,500 కోట్ల భారీ రాబడి సమకూరుతోంది. ఈ డివిజన్ పరిధిలో ప్రస్తుతం 18 వేల మంది ఉద్యోగులు విధుల్లో ఉండగా, సుమారు 50 వేల మంది పెన్షనర్లు ఉన్నారు.దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వచ్చిన నాలుగు డివిజన్లలోనూ ఆదాయం, ప్రయాణికుల రద్దీ పరంగా విజయవాడ డివిజనే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం విజయవాడ రైల్వేస్టేషన్ మీదుగానే ప్రతిరోజూ లక్ష మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా, నిత్యం 250కి పైగా ప్యాసింజర్ రైళ్లు, మరో 450 వరకు గూడ్స్ రైళ్లు ఇక్కడి నుంచి ప్రయాణిస్తుంటాయి. పండగలు, సెలవు దినాల్లో ప్రయాణికుల సంఖ్య ఏకంగా 2 లక్షలకు చేరుకుంటుంది. ఈ డివిజన్ పరిధిలో ఉత్తరాన అనకాపల్లి సమీపం నుంచి దక్షిణాన గూడూరు జంక్షన్ వరకు, అలాగే గుడివాడ-మచిలీపట్నం, భీమవరం-నిడదవోలు, కాకినాడ-కోటిపల్లి బ్రాంచ్ లైన్లతో కలిపి వందకు పైగా రైల్వే స్టేషన్లు విస్తరించి ఉన్నాయి. దీనికి తోడు కృష్ణపట్నం అంతర్జాతీయ ఓడరేవు, కాకినాడ పోర్టుతో పాటు నిర్మాణంలో ఉన్న మచిలీపట్నం పోర్టులు ఈ పరిధిలోనే ఉండటంతో ఇక్కడి నుంచి సరకు రవాణాకు భారీ డిమాండ్ ఉంటోంది.మరోవైపు కొత్త జోన్‌ పరిధిలోకి రావడంతో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న నూతన రైళ్ల విజ్ఞప్తులు ఇకనైనా నెరవేరుతాయని ఈ ప్రాంత ప్రయాణికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ నుంచి రాజస్థాన్, హౌరా, షిరిడీ, నాగపట్నం (వేళంగిణి)తో పాటు ఐటీ కారిడార్ అయిన బెంగళూరుకు కొత్త రైళ్లను నడపాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. అలాగే అత్యంత రద్దీగా ఉండే విశాఖపట్నం, సికింద్రాబాద్ రూట్లలో కూడా రైళ్ల సంఖ్యను పెంచాలని స్థానికులు కోరుతున్నారు. కాగా, ఈ ప్రాంత ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తూ విజయవాడ నుంచి ‘కనకదుర్గమ్మ’ పేరుతో ఒక ప్రత్యేక రైలును నడపడానికి రైల్వేశాఖ ఇప్పటికే ఆమోదముద్ర వేయడంతో, నూతన జోన్‌లో ఈ డివిజన్ మరింత ప్రగతి పథంలో దూసుకుపోనుందని అధికారులు భావిస్తున్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor