తిరుమల/తిరుపతి,వి90 న్యూస్,ఆగస్టు 23: తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా మొదటిరోజు పవిత్ర ప్రతిష్టను అర్చకులు వైభవంగా నిర్వహించారు.ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేపట్టారు. అనంతరం సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ సమయంలో వేద పండితులు పంచసూక్తాలను పఠించగా, అనంతరం పవిత్ర ప్రతిష్ట మహోత్సవం జరిగింది. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు.సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.

